: పెను తుపానుకు ఫైలిన్ పేరు ఎలా వచ్చిందంటే....
ప్రపంచ వ్యాప్తంగా తుపాన్లను పేర్లతో సంభోధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఓ మోస్తరుగా తమిళనాడుపైనా ప్రభావం చూపనున్న తుపానుకు ఫైలిన్ గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ పేరును థాయ్ లాండ్ సూచించింది. థాయ్ భాషలో ఫైలిన్ అంటే నీలమణి (Sapphire) అని అర్థం. హిందూ మహా సముద్రం లోని ఉత్తర భాగంలో ఏర్పడే తుపానులకు సంబంధించి ఈసారి థాయ్ లాండ్ సూచించిన పేరును తీసుకున్నారు. తర్వాత ఏర్పడే తుపానుకు 'హెలెన్' అనే పేరు పెడతారు. ఈ పేరు బంగ్లాదేశ్ సూచించింది.
తుపానులకు పేర్లు పెట్టే విధానం అమెరికా లాంటి దేశాల్లో చాలా సంవత్సరాల నుంచి అమల్లో ఉంది. మన ప్రాంతంలో దాదాపు దశాబ్ద కాలం నుంచి దీన్ని ఆచరిస్తున్నారు. తుపానులను సులువుగా గుర్తించడానికి పేర్లను వాడుతున్నారు. తేదీలను లేదా ఇతర టెక్నికల్ సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుని తుపానులను అంత ఈజీగా గుర్తించలేకపోతున్నారు. అందుకే వీటికి కూడా పేర్లు పెట్టడం ప్రారంభించారు. ప్రతి తుపాను కూడా వాటికి పెట్టిన పేరు మీద రికార్డుల్లో నిలిచిపోతుంది. అంతే కాకుండా తుపానులకు సంబంధించిన సమాచారాన్ని వేగంగా అందించడానికి ప్రభుత్వాలకు కానీ, మీడియాకు కానీ వీటి పేర్లు సహకరిస్తాయని నిపుణులు చెపుతున్నారు. దీనికి తోడు ప్రజలకు కూడా తుపానులను గుర్తుంచుకోవడానికి ఈ పేర్లు సహకరిస్తాయి.
ఇంకా వివరంగా చెప్పాలంటే... ప్రపంచాన్ని భౌగోళికంగా కొన్ని ప్రాంతాలుగా విడదీశారు. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతంలోని భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్ లాండ్ దేశాలతో ప్రపంచ వాతావరణ సంస్థ ఒక జాబితా తయారుచేసింది. ఈ సంస్థ సూచనల మేరకు బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రాలలో ఏర్పడే తుపానులకు పైన తెలిపిన దేశాలు నామకరణం చేస్తాయి. ఈ దేశాలు సూచించిన పేర్లతో అక్షరక్రమంలో తుపానులకు నామకరణం చేస్తారు. దీన్ని అనుసరించి ఇప్పుడు ఏర్పడిన తుపానుకు ఫైలిన్ అని పేరు పెట్టారు.