: శ్రీహరి చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా
నటుడు శ్రీహరి మృతి చెందారంటే నమ్మలేకపోతున్నానని దర్శకుడు ప్రభుదేవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల ముందు కూడా షూటింగ్ లో పాల్గొన్నారని, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉత్సహంగానే కనిపించారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో ఉక్కు మనిషిగా ఆయనకు పేరుందని, తాను పనిచేసిన అత్యంత ఆరోగ్యకరమైన, ఫిట్ నెస్ ఉన్న నటుల్లో శ్రీహరి ఒకరని పేర్కొన్నారు. ఆయనకు కేన్సర్ ఉన్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన ప్రభుదేవా.. శ్రీహరి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన చిత్రం 'రాంబో రాజ్ కుమార్' షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో శ్రీహరి అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. గుండెపోటు రావడంవల్లే ఆయన మరణించినట్లు ప్రభు వెల్లడించారు.