: దిగ్విజయ్ కు సీఎం కిరణ్ ఫోన్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానంపై దిగ్విజయ్, షిండేల భిన్న ప్రకటనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. పార్టీ, ప్రభుత్వ ప్రకటనలు వేర్వేరుగా ఉండటంపై ప్రజల్లో అయోమయం నెలకొందని తెలిపారు. కాబట్టి, తీర్మానంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగ సంఘాలకు నచ్చజెప్పి సమ్మె విరమింపజేస్తున్న సమయంలో ఇలాంటి అస్పష్ట ప్రకటనలు ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నాయని వివరించారు. అంతేగాక తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని మీరు చెబితే, నేరుగా తెలంగాణ బిల్లే అసెంబ్లీకి వస్తుందని షిండే చెప్పారని వివరించిన కిరణ్.. ఏది వాస్తవమో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తాను మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నానని చెప్పిన దిగ్విజయ్.. ఢిల్లీకి రాగానే హోంమంత్రితో మాట్లాడి స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.