: పార్లమెంటు వ్యవస్థను కాంగ్రెస్ అపహాస్యం చేసింది: మోదుగుల
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వ్యవస్థనే అపహాస్యం చేసిందని టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలోని ఏపీభవన్లో చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షా స్థలి వద్ద ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలన్నా, ప్రజాస్వామ్య వవస్థ అన్నా గౌరవం లేదన్నారు. సీమాంధ్ర ప్రజలు రెండు నెలలుగా దీక్షలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని హోరెత్తిస్తుంటే కేంద్రానికి చీమకుట్టినట్టైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగుప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దీక్ష ద్వారా ప్రశ్నిస్తే అది సజావుగా సాగకుండా అడ్డంకులు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలంతా జరుగుతున్న అరాచకాన్ని చూస్తున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం నేర్పుతారని ఆయన హెచ్చరించారు.