: నిద్రిస్తూనే పాతాళానికి!
ఉన్నట్లుండి భూమి ఒక్కసారిగా కూలిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే కాలుకింద పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇలాంటి సీన్లు హాలీవుడ్ సినిమాలలో కనిపిస్తుంటాయి. కానీ భయోత్పాతం కలిగించే ఇలాంటి ఘటనలు అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రజలకు సుపరిచితం. ప్రత్యక్షంగా ఎదుర్కొంటుంటారు.
గురువారం రాత్రి ఫ్లోరిడాలోని తంపా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. నిద్రిస్తున్న జెఫ్ బుష్ బెడ్,కాట్ తో సహా లోపలికి వెళ్లిపోయాడు. ఈ శబ్దానికి జెఫ్ సోదరుడు జెర్మీ బుష్ ఉలిక్కిపడి లేచాడు. చూస్తే పేద్ద గొయ్యి. వెంటనే అందులోకి దూకేసి సోదరుడి కోసం వెతికాడు. ఎక్కడా జాడలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన పక్కింటాయన జెర్మీని రక్షించాడు.
ఇప్పుడు అక్కడ 20 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పుతో పెద్దగొయ్యి ఏర్పడింది. విపత్తు సహాయక దళాలు వచ్చి భూమి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించాయి. అందులో మనుషుల ఆనవాళ్లు లేవని నిర్ధారించారు. మరి జెఫ్ ఏమయ్యాడు? భూమి పొరల్లో కలిసి పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. భూమి పొరల్లో ఏర్పడే తేడాల కారణంగా ఇలాంటి గొయ్యిలు ఏర్పడుతుంటాయని నిపుణులు చెబుతుంటారు.