: మీరు గురకపెడుతున్నారా... అయితే, ఇది మీ కోసమే!
మీరు నిద్రలో గురక పెడుతున్నారా... మీ గురక వల్ల మీ ఇంట్లో వారికి అసౌకర్యంగా ఉందా... అయితే ఈ చిట్కా మీలాంటి వారికోసమే. చాలామంది నిద్రలో గురక పెడుతుంటారు. కొందరు పెట్టే గురక ఇంట్లోని వారికి ప్రశాంతతను దూరం చేస్తుంది. కొన్ని విడాకుల కేసుల్లో తమ భాగస్వామి గురకే ప్రధాన కారణం అని వింటే గురక ఎంతగా ఎదుటివారిని బాధిస్తుందో అర్ధం చేసుకోవాలి. అలాంటి గురకను దూరం చేసుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతవరకూ సమస్య తగ్గే అవకాశాలున్నాయట.
నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. దీనికితోడు సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగినుల్లో ఎక్కువమంది ఇలా గురక సమస్యతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. ఇలాంటి సమస్యతో సతమతమయ్యేవారు రోజూ పడుకునేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా ఉంటుందట. అలాగే కొందరు నిద్రలో పలవరిస్తుంటారు. ఇలాంటివారు తలగడకింద పటిక పెట్టుకుని నిద్రపోతే మంచి సుఖనిద్ర పడుతుందని ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించి మీరు ప్రశాంతంగా నిద్రపోవచ్చు, మీ ఇంట్లోని వారికి ప్రశాంతతని కల్పించవచ్చు.