: సచిన్ కెరీర్ గణాంకాలివిగో..


సచిన్ రమేశ్ టెండూల్కర్ (40).. 1989 నవంబర్ 15న అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన ఈ అపార ప్రతిభాశాలి ఇప్పుడు కెరీర్ చరమాంకంలో నిలిచాడు. పాకిస్థాన్ పై టెస్టు మ్యాచ్ ద్వారా తన బ్యాట్ పవర్ ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఈ మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ తన ప్రస్థానంలో అనితర సాధ్యమైన రికార్డులు నమోదు చేశాడు. ఓవరాల్ గా వంద సెంచరీలు, అత్యధిక పరుగులు, అత్యధిక మ్యాచ్ లు.. ఇలా ఎన్నో ఘనతలు మాస్టర్ ను వరించాయి.

198 టెస్టుల్లో 53.86 సగటుతో 15,837 పరుగులు చేసిన సచిన్.. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత స్థానాల్లో ఉన్న పాంటింగ్ (168 టెస్టుల్లో 13,378), రాహుల్ ద్రావిడ్ (164 టెస్టుల్లో 13,288) ఎప్పుడో క్రికెట్ నుంచి తప్పుకున్నారు.

ఇక వన్డే క్రికెట్ విషయానికొస్తే సచిన్ దరిదాపుల్లో నిలిచినవారే లేరు. అత్యధికంగా 463 వన్డేలాడి 18,426 పరుగులు చేశాడు. సగటు 44.83 కాగా, 49 సెంచరీలు, 96 అర్థసెంచరీలున్నాయి. బౌలింగ్ తో జట్టును అప్పుడప్పుడూ ఆదుకునే సచిన్ టెస్టుల్లో 45, వన్డేల్లో 154 వికెట్లు తీశాడు. అయితే, దురదృష్టకరంగా సచిన్ ఒకే ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడాడు. యువకులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు.

2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత 50 ఓవర్ల క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్ అప్పటి నుంచి టెస్టుల్లో కొనసాగుతున్నాడు. అయితే, పేలవ ఫామ్, పైబడుతున్న వయసు మాస్టర్ ప్రతిభను మసకబార్చాయి. ఓవైపు యువకులు సత్తా చాటుతుండడం, మరోవైపు మాజీల ఒత్తిళ్ళు సచిన్ ను రిటైర్మెంటు నిర్ణయం దిశగా నడిపించాయని అర్థమవుతోంది

  • Loading...

More Telugu News