: విద్యుత్ సమ్మె తాత్కాలికంగా వాయిదా: విద్యుత్ జేఏసీ
విద్యుత్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు విద్యుత్ జేఏసీ ఉద్యోగులు తెలిపారు. ముఖ్యమంత్రితో సుదీర్ఘ సమావేశం తరువాత ముఖ్యమంత్రి కోరిక మేరకు తాము సమ్మెను వాయిదా వేస్తున్నామని సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కేంద్రం కొంత వెనకడుగు వేసిందని, అందువల్లే తాము కాస్త తలొగ్గామని వారు వెల్లడించారు. అయితే, తమ ఉదారతను చూసి వెనకడుగు వేశామని భావించొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుపాను ఇబ్బందులు చుట్టుముట్టడంతో ప్రజలకు విద్యుత్ అవసరం ఉంటుందని, అందుకే తాము తాత్కాలిక విరమణ ప్రకటించామని వారు స్పష్టం చేశారు.
విభజనపై కేంద్రం ఏమాత్రం ముందడుగు వేసినా తమ సమ్మె మరింత ఉద్ధృతం అవుతుందని వారు హెచ్చరించారు. మెరుపు సమ్మెకు కూడా తాము వెనుకాడబోమని తెలిపారు. అసెంబ్లీకి బిల్లు వస్తుందని దిగ్విజయ్ తనతో రెండుసార్లు చెప్పారని, షిండే కూడా అదే చెప్పారని సీఎం తమతో అన్నారని, బిల్లు అడ్డుకుంటామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. అందుకే తాము సమ్మెకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నామని సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు ప్రకటించారు. 30 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 15 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు, ప్రజలు తమ సమ్మెకు సహకరించారని వారందరికీ ధన్యవాదాలని జేఏసీ నేతలు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని వారు సూచించారు.