: అందరూ మోసం చేశారు: అశోక్ బాబు
రాష్ట్రవిభజన విషయంలో సీమాంధ్ర ప్రజలను సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, కేంద్రప్రభుత్వం అంతా కలిసి మోసం చేశారని ఎపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో సమైక్య మహాగర్జన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన ప్రకటన నుంచీ కేబినెట్ నోట్ పెట్టే వరకు కేంద్రం, మంత్రులు, ఎంపీలు అందరూ నాటకాలాడి తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించారని అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి బయటకు రావాలని, తమను ఎన్నుకున్న ప్రజలకు ఆమాత్రమైనా గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో సమైక్య రాష్ట్రానికి కట్టుబడిన నేతలను గెలిపించాలని ఆయన ప్రజలకు సూచించారు. 2014 ఎన్నికల వరకు విభజన జరుగకుండా తాము చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన ప్రజలతో 'జై సమైక్యాంధ్ర' నినాదాలు చేయించారు.