: ఇందిరమ్మే విడదీయలేదు.. వీరికున్న అర్హత ఏంటి?: పయ్యావుల


విభజనకు ఇందిరాగాంధీ అంతటి నేతే ఒప్పుకోలేదని, అలాంటిది విభజించడానికి ఇప్పుడున్న నేతలకు ఉన్న అదనపు అర్హత ఏంటని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజీనామాలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు కేంద్రాన్ని నిలదీసి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు పయ్యావుల సవాలు విసిరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం జరగాలన్నారు. కానీ, రాజ్యాంగ మార్గదర్శకాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి నచ్చినట్టు గోప్యంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఎన్డీయే హయాంలో రాష్ట్రాల విభజన జరిగినప్పడు అన్ని ప్రాంతాల అనుమతి ప్రకారం శాసనసభ ఆమోదంతోనే విభజన జరిగిందని ఆయన గుర్తు చేశారు.

కానీ, కాంగ్రెస్ పార్టీ కుటిల నీతితో రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్ర చేస్తోందన్న సమాచారం తమవద్ద ఉందని ఆయన స్ఫష్టం చేశారు. దీక్ష చేయడం ముఖ్యం కాదని దానిద్వారా విభజనపై ఏ స్థాయిలో చర్చ జరిగిందీ, ఎలాంటి సమాధానం లభించిందన్నదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు జాతీయ సమస్యగా దీనికి ఓ ప్రాధాన్యత కల్పించారని ఆయన తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలను కూర్చోబెట్టి మాట్లాడి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న పయ్యావుల, ప్రజలు రాజకీయ పార్టీలను నమ్మే స్థితిలో లేరని అన్నారు.

  • Loading...

More Telugu News