: తెలంగాణపై కాంగ్రెస్ వెనకడుగు వేసిందా..?


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం, నిరసనల ధాటికి వెనక్కి తగ్గిందా? తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎడ్లబండి వేగంతోనే ముందుకు వెళ్లాలని భావిస్తోందా? ఢిల్లీలో తాజా పరిణామాలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.

వారం క్రితం కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఆ సందర్భంగా కేబినెట్ నోట్ లో తెలంగాణ ఏర్పాటు విధి విధానాలను ఖరారు చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు.. ఇందుకు 45 రోజుల గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ, మంగళవారం కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని అధికారికంగా ఏర్పాటు చేసినట్టు ప్రకటించినా గడువును మాత్రం పేర్కొనలేదు.

దీనికితోడు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి చాకో తాజా వ్యాఖ్యలతో తెలంగాణ ఏర్పాటుపై సందేహాలు మొలకెత్తాయి. ఎన్నికల్లోపు తెలంగాణ ఏర్పాటుకు ప్రయత్నిస్తామంటూ దిగ్విజయ్ చెప్పారు. వాస్తవానికి ఇదే దిగ్విజయ్ లోగడ ఎన్నికల్లోపు తెలంగాణ కచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక పీసీ చాకో అయితే ఎన్నికల్లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రక్రియ మొదలైందని.. అది ఎన్నికల్లోపు పూర్తి కాకుంటే ఎన్నికల తర్వాత అయినా తెలంగాణ ఏర్పాటును పూర్తి చేస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంపై వేగంగా ముందుకు వెళ్లలేమని, కొన్ని సమస్యలు ఉన్నాయని, అందరితోనూ మాట్లాడాలని అనుకుంటున్నామని పరోక్షంగా సీమాంధ్రుల ఆందోళనలను చాకో ప్రస్తావించారు. అయితే, సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలను ఉపశమింపజేసి.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడానికే వ్యూహాత్మకంగా వీరిలా ప్రకటించారా? లేక నిజంగా సీమాంధ్ర ప్రాంత ప్రజలు, నేతల ఆందోళనలకు తలొగ్గి స్వరం మార్చారా? అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది.

  • Loading...

More Telugu News