: సినీ నటుడు శ్రీహరి కన్నుమూత
సినీ హీరో శ్రీహరి (49) కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ముంబయి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు కాగా.. కుమార్తె నెలల వయసులోనే అకాలమరణం పాలైంది. నటి డిస్కో శాంతిని ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాదు బాలానగర్లో ఆయన 1964 ఆగస్టు 15న జన్మించారు. శ్రీహరి త్వరలోనే కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవలే ఆయన వైఎస్సార్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
'పోలీస్' చిత్రంతో శ్రీహరి కథానాయకుడిగా మారారు. అంతకుముందు 'విశ్వనాథనాయకుడు' చిత్రంతో సినిమా కెరీర్ ఆరంభించారు. కెరీర్ ఆరంభంలో ఆయనకు ఎక్కువగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలే లభించాయి. ఇప్పటివరకు 97 చిత్రాల్లో నటించిన శ్రీహరి.. నటనను కెరీర్ ఎంచుకోక ముందు స్టంట్ మేన్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. విద్యార్థిగా ఉన్నప్పుడు జిమ్నాస్టిక్స్ లో ప్రావీణ్యం సంపాదించిన శ్రీహరి రాష్ట్రస్థాయిలో అనేక క్రీడాపోటీల్లో సత్తా చాటారు.