: రేపటి నుంచి ఇండో-ఆసీస్ క్రికెట్ సమరం


భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మరో ఆసక్తికర సమరానికి రేపు తెరలేవనుంది. రాజ్ కోట్ వేదికగా రేపు సాయంత్రం జరిగే టి20 మ్యాచ్ తో క్రికెట్ ప్రియులకు విందు ఖాయంగా కనిపిస్తోంది. ఏకైక టి20 మ్యాచ్ అనంతరం రెండు జట్లు ఏడు వన్డేల సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే సిరీస్ ఈ నెల 13 నుంచి నవంబర్ 2 వరకు జరగనుంది. ఆయా జట్ల బలబలాల విషయానికొస్తే..

యువరాజ్ రాకతో టీమిండియా మిడిలార్డర్ మరింత బలోపేతమైంది. ఓపెనర్లుగా ధావన్, రోహిత్ శర్మ జోడీనే కొనసాగే అవకాశాలున్నాయి. ఇక కెప్టెన్ ధోనీ, డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి తోడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉండనే ఉన్నాడు. తెలుగుతేజం అంబటి రాయుడికి అవకాశాలు లభించడం ఈసారి కష్టమే. భారత్ పూర్తిస్థాయి బ్యాటింగ్ లైనప్ తో బరిలో దిగనుండడమే అందుకు కారణం. ఏదేమైనా బ్యాటింగ్ కు అచ్చొచ్చే భారత పిచ్ లపై టీమిండియా టాపార్డర్ ను నిలువరించాలంటే కంగారూ సీమర్లు చెమటోడ్చక తప్పదనిపిస్తోంది.

ఇక యువ పేసర్లు, ప్రతిభావంతులైన స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ విభాగం ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ కు సమస్యలు సృష్టించేందుకు తహతహలాడుతోంది. ఆసీస్ జట్టు విషయానికొస్తే.. ప్రధానంగా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ పైనే ఆ జట్టు ఆధారపడనుంది. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న వాట్సన్ కు భారత పిచ్ లు కొట్టినపిండే. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఈ ఆజానుబాహుడు రాణిస్తే తమకు తిరుగుండదని ఆసీస్ శిబిరం భావిస్తోంది.

కెప్టెన్ క్లార్క్ గాయంతో వైదొలగడంతో అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేని జార్జ్ బెయిలీ జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సూపర్ ఫాంలో ఉన్న ధోనీ సేనను నిలువరించాలంటే కంగారూలకు శక్తికి మించిన పనే.

  • Loading...

More Telugu News