: 'బాయ్' పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్)పై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. జ్వాలపై జీవితకాల నిషేధం విధించాలంటూ క్రమశిక్షణ కమిటీ 'బాయ్'కి ఫిర్యాదుచేసిన నేపథ్యంలో న్యాయ సహాయం కోసం కోర్టులో ఆమె పిటిషన్ వేసింది. ఈ ఏడాది జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో జ్వాల ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ స్మాషర్స్ క్రీడాకారులను, బంగా బీట్స్ తో ఆడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిందంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై విచారించిన కమిటీ జీవితకాల నిషేధానికి సిఫార్సు చేసింది. అయితే, ఆమె ట్రాక్ రికార్డును పరిశీలించిన బాయ్ నిర్ణయాన్ని వాయిదా వేసింది. క్షమాపణ చెప్పేంతవరకు జ్వాలను ఎలాంటి టోర్నీకి ఎంపికచేయబోమని స్పష్టం చేసింది. మరోవైపు, తన కుమార్తె ఎలాంటి తప్పు చేయలేదని, ఆమె క్షమాపణ ఎందుకు చెప్పాలని జ్వాల తండ్రి క్రాంతి జ్వాల ప్రశ్నించారు. కాగా, జ్వాల క్రీడా శాఖను కలిస్తే ఈ విషయాలపై చర్చిస్తామని ఆ శాఖా మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.