: భారీగా తగ్గిన దేశ వాణిజ్య లోటు
సెప్టెంబర్ లో దేశ వాణిజ్య లోటు గణనీయంగా తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. బంగారం దిగుమతులు భారీగా తగ్గడం ఫలితమిచ్చింది. సెప్టెంబర్ లో వాణిజ్య లోటు 6.76 బిలియన్ డాలర్ల ( 6,200కోట్ల రూపాయలు)కు తగ్గింది. గతేడాది ఇదే నెలలో ఉన్న వాణిజ్య లోటు 17.15 బిలియన్ డాలర్లు. ముఖ్యంగా ఎగుమతులు 11.5 శాతం పెరగడం, అదే సమయంలో దిగుమతులు 18.1 శాతం తగ్గడంతో వాణిజ్య లోటు దిగి వచ్చింది.
2011 తర్వాత వాణిజ్య లోటు ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. దీనికి బంగారం, చమురు దిగుమతులు తగ్గడమే కారణమని వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావు తెలిపారు. బంగారం, వెండి దిగుమతులు 2012 సెప్టెంబర్ లో 4.6 బిలియన్ డాలర్లు ఉంటే గత నెలలో ఇవి 0.8 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే బంగారం, వెండి దిగుమతులు 8.7 శాతం పెరిగి 23.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.