: వాళ్ల నోట్లోనే నువ్వుగింజ దాగదట!


ఆడవారి నోట్లో నువ్వు గింజకూడా దాగదని పెద్దలు సామెత చెబుతుంటారు. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదుగానీ, మహిళలు చాలా వరకూ గోప్యత పాటిస్తారట. సాధారణంగా ఇద్దరు ఆడవాళ్లు ఒకచోట చేరితే ఇక వారి ముచ్చట్లు మొదలు. అందునా వారు స్నేహితులైతే ఇక చెప్పాల్సిన పనిలేదు. అలాగే మగవారు కూడా ఈ ముచ్చట్ల విషయంలో తక్కువేమీ కాదట. నిజానికి ఆడవారితో పోల్చుకుంటే మగవారు గోప్యత పాటించే విషయంలో వీకేనంటున్నారు పరిశోధకులు. ఈ విషయంపై ప్రత్యేక పరిశోధన నిర్వహించిన పరిశోధకులు ఆడవారితో పోల్చుకుంటే మగవారి వద్ద ఎలాంటి విషయాలు కూడా దాగవని తేలింది.

అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఆడవారితో పోల్చుకుంటే మగవారి నోట్లోనే రహస్యాలు దాగవని తేలింది. రెండేళ్లపాటు పరిశోధకులు కొందరిపై అధ్యయనాన్ని నిర్వహించారు. కొందరు పురుషులను, కొందరు మహిళలను ఎంపిక చేసుకుని వారిని రెండు వర్గాలుగా విభజించి, వారికి వేరు వేరు విషయాలను రహస్యంగా విడివిడిగా వారితో పంచుకున్నారు. ఇలా పంచుకున్న విషయాల్లో అరవైశాతం పైగా మగవారి ద్వారా వెల్లడయ్యాయట.

కూరల్లో మాత్రమే ఆడవారు మసాలా వేస్తుంటారు. కానీ మగవారు కబుర్లలో కూడా మసాలా దట్టించి చెప్పడంలో ముందుంటారని ఈ అధ్యయనంలో తేలింది. ఉన్న విషయానికి మసాలా కలిపి చెప్పడంలో మగవారే ముందున్నారట. ఎవరైనా తమని నమ్మి చెప్పిన విషయాలను దాచడంలోను, ఇలా దాచడం వల్ల ఇబ్బందులు పడ్డా, నిందలు ఎదురైనా వాటిని భరించడంలో మహిళలు ఎంతో పరిణతి సాధించారని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారు చెబుతున్నారు.

కర్ణుడు పుట్టిన విషయాన్ని కడవరకూ దాచినందుకు కుంతికి ధర్మరాజు శాపం ఇచ్చాడట, ఆడవారి నోట్లో నువ్వు గింజ కూడా దాగదని. ఈ కథలో ఎంతవరకూ నిజం ఉందోగానీ ఆడవారు మాత్రం ఈ శాపాన్ని అధిగమించేశారనే ఈ పరిశోధనా ఫలితాల ఆధారంగా చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News