: పెట్రోలు లీటర్ రూ.250, డీజిల్ రూ.150.. ఉద్యమం ఎఫెక్ట్
కాంగ్రెస్ అధిష్ఠానం తీరుతో సీమాంధ్ర అట్టుడుకుతోంది. ఉద్యమకారులు, ప్రజలు విభజనకు వ్యతిరేకంగా కదంతొక్కుతుండడంతో నిత్యావసరాలతో పాటు ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అనంతపురంలో ట్యాంకర్లు గత 3 రోజులుగా బంద్ సందర్భంగా నిలిచిపోవడంతో గుంతకల్లు, కడప జిల్లాల నుంచి అనంతపురం రవాణా కావాల్సిన ఇంధనం ఆగిపోయింది. దీంతో 80 శాతం పెట్రోలు బంక్ లు 'నో స్టాక్' బోర్డులు పెట్టుకోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లాలో 220 పెట్రోలు బంక్ లు ఉండగా 190 బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిండుకున్నాయి. దీంతో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదను చూసి చిరు వ్యాపారులు బ్లాక్ లో డీజిల్ లీటర్ 150 రూపాయలకు, పెట్రోలు లీటర్ 250 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. మరో రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని పౌరసరఫరాల అధికారులు భావిస్తున్నారు.