: గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి: గిరిజన ప్రజాప్రతినిధులు
గిరిజన ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రవిభజన, బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు కేటాయించాలని గిరిజన ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. కేటాయింపుల విషయాన్ని కేబినెట్ నోట్, ప్రత్యేక రాష్ట్ర బిల్లులో పొందుపరచాలని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టం చేసిన తరుణంలో గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, దీనికి సంబంధించిన అన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఒక నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి వర్గ బృందానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి, ఆంటోనీ కమిటీకి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ముఖ్య నేతలకు అందజేయనున్నట్లు గిరిజన శాఖ మంత్రి బాలరాజు వెల్లడించారు. దీనిపై అందుబాటులో ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులంతా కలిసి చర్చించినట్లు తెలిపారు. ఐటీడీఏ కేంద్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు కేటాయించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.