: బీసీసీఐ ఆంక్షలు.. కామెంటరీ చాన్సు వదులుకున్న చాపెల్


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ సంఘం. విదేశీ క్రికెట్ బోర్డులు సైతం బీసీసీఐతో సామరస్య ధోరణిలో మెలుగుతుంటాయి. వందల కోట్ల వార్షిక ఆర్జనతో ఈ ప్రపంచ క్రికెట్ పెద్దన్న ఐసీసీని సైతం తన గుప్పెట్లో ఉంచుకుందన్నది బహిరంగ రహస్యం. అలాంటి బీసీసీఐకి క్రికెట్ మ్యాచ్ లు ప్రసారం చేసే టీవీ చానళ్ళు ఓ లెక్కా. అందుకే టీమిండియా ఆడే మ్యాచ్ లను కవర్ చేసే టీవీ చానళ్ళకు బీసీసీఐ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆ చానళ్ళ కామెంటేటర్లు చేయాల్సినవి, చేయకూడనివి అంటూ ఓ జాబితా పంపింది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ మండిపడ్డాడు.

ఇంతకీ ఈయన ఆగ్రహానికి కారణమేంటంటే.. ఆసీస్ జట్టుతో టీమిండియా వచ్చే నెలలో ఆడే ఏడు వన్డేల సిరీస్ కు చాపెల్ ను కామెంటేటర్ గా ఎంపిక చేసుకుంది ఈఎస్ పీఎన్ సంస్థ. అయితే, బీసీసీఐ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని ఈఎస్ పీఎన్ స్పష్టం చేయడంతో చాపెల్ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ సెలెక్షన్ విధానంపై వ్యాఖ్యానించరాదని, డీఆర్ఎస్ విధానంపై తోటి కామెంటేటర్లతో చర్చించకూడదని ఆంక్షలు విధించారని చాపెల్ చెప్పాడు. అలాంటప్పుడు స్వేచ్ఛగా పనిచేయడం కష్టమన్న అభిప్రాయంతోనే కామెంటేటర్ చాన్సును వదులుకుంటున్నట్టు తెలిపాడు.

కాగా, భారత్-ఆసీస్ సిరీస్ కు కంగారూ మాజీలు మాథ్యూ హేడెన్, షేన్ వార్న్ కామెంటేటర్లుగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఈఎస్ పీఎన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

  • Loading...

More Telugu News