: ఆ ముగ్గురూ ఒకే వేదికపై దీక్ష చేస్తే సరి: పొన్నం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత జగన్, సీమాంధ్ర ఉద్యమ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఒకే వేదికపై దీక్ష చేస్తే బాగుంటుందని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం విభజన జరుగుతుందని అన్నారు. నీటి పంపకాలు నిర్దేశించిన ప్రకారం జరుగుతాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణలో కంటే సీమాంధ్రలో ఛాంపియన్ అనిపించుకోవాలని ఈ ముగ్గురు నేతలు తెగ తాపత్రయపడుతున్నారని ఆయన మండిపడ్డారు. వీరి తాపత్రయాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.
రాజకీయ అధికారం కోసం ఈ ముగ్గురూ ఆందోళన పేరిట నాటకాలు ఆడుతున్నారని పొన్నం విమర్శించారు. రాజకీయ పార్టీల అనుమతి తీసుకుని, బీజేపీ సహకారంతో చట్టప్రకారం జరుగుతున్న విభజన ఇదని ఆయన అభిప్రాయపడ్డారు. బెరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నట్టు ఈ ముగ్గురు రాయలసీమ బిడ్డలు డబ్బు దండుకోవడానికే ఉద్యమమంటున్నారని ఆయన దుయ్యబట్టారు.