: 'తందూరీ మర్డర్ కేసు'లో ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ పార్టీ మాజీ యువనేత సుశీల్ శర్మ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. 1995లో సుశీల్ శర్మ తన భార్య నైనా సాహ్నిని హత్య చేసి... తందూరీ పొయ్యిలో కాల్చి బూడిద చేశారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తందూరీ మర్డర్ కేసుగా ఇది ప్రచారంలోకి వచ్చింది. ఈ నేరానికి సంబంధించి 2003లో ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం సుశీల్ శర్మకు మరణశిక్షను విధించింది. అయితే, తన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఆయన సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. దీన్ని విచారించిన సుప్రీం కోర్టు చివరకు సుశీల్ శర్మ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ తీర్పునిచ్చింది.