: ఎండుద్రాక్షతో ఎంతో మేలు
ఎండుద్రాక్ష మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. చక్కగా రోజూ కాస్తంత ఎండు ద్రాక్ష తీసుకుంటే పలు రకాలైన సమస్యలను దూరం చేయవచ్చట. ముఖ్యంగా మహిళలు రోజూ కాస్త ఎండు ద్రాక్ష తీసుకోవడం వల్ల పలు రకాలైన సమస్యలను నివారించవచ్చట.
మహిళల్లో ముఖ్యంగా గర్భిణులకు తగు శక్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి వారు క్రమం తప్పకుండా ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల కావలసిన శక్తి అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షలో బి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గర్భిణులు ద్రాక్షపండ్లను తీసుకోవడం వల్ల గర్భంలోని శిశువుకు కావలసిన శక్తి లభిస్తుంది. ఎండుద్రాక్షని పాలల్లో కలిపి వేడిచేసి తాగడంవల్ల గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు మహిళలకు నెలసరి సమయంలో కడుపునొప్పి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎండుద్రాక్షని కొంత నీటిలో వేసి వేడిచేసి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అయితే ఎండుద్రాక్ష తింటే మేలుకదా అని అలాగే తినేయకుండా వాటిని నీటిలో వేసి కడిగి తింటే మరింతమేలు.