: క్యాన్సర్‌ నివారణకు క్యారెట్‌ మందు


క్యారట్‌ కంటికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పీచు పదార్ధాలతోబాటు పుష్కలంగా విటమిన్లు ఉండడం వల్ల క్యారట్‌ను రోజూ తిన్నా మంచిదేనని పలువురు నిపుణులు చెబుతుంటారు. అలాగే క్యారట్‌నుండి తీసిన కొన్ని సమ్మేళనాలను ఉపయోగించి క్యాన్సర్‌, ఫ్లూ, హృదయ నాళాలకు సంబంధించిన వ్యాధులను, నాడీ క్షీణతను నివారించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి ఒక సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరచారు.

ఫ్లూ నివారణకు టామిఫ్లూను అనే మందును ఉపయోగిస్తుంటారు. ఈ మందును షిక్నిక్‌ ఆమ్లం నుండి తయారుచేస్తారు. ఇది ఇప్పటి వరకూ మసాలా దినుసుల్లో వాడే అనాస పువ్వులోనే ఉంటుంది. తాజాగా క్యారట్‌నుండి కూడా ఈ షిక్నిక్‌ ఆమ్లాన్ని గ్రహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆహారశాస్త్రంలో 2012కిగాను అమెరికా జాతీయ అవార్డు అందుకున్న జాకబో వెలాజక్వస్‌ నేతృత్వంలో జరుగుతున్న పరిశోధనల్లో క్యారట్‌నుండి తీసిన సహజ సమ్మేళనాలను ఉపయోగించి క్యాన్సర్‌, ఫ్లూ, గుండె నాళాలకు సంబంధించిన వ్యాధులను, నాడీ క్షీణతను నివారించవచ్చని కనుగొన్నారు.

ఈ విషయం గురించి జాకబో మాట్లాడుతూ క్యారట్‌ మొక్కలో జీవక్రియను మరింత చైతన్యవంతం చేసి అనంతరం కర్బన ప్రసారాలను క్రమబద్దీకరిస్తే ఎక్కువ మొత్తంలో షిక్నిక్‌ ఆమ్లం, ఫినోలిక్‌ సమ్మేళనాలు మొక్క కణజాలంలో వృద్ధి చెందుతాయని, అలాంటి మొక్కల నుండి వచ్చే క్యారెట్‌ల నుండి షిక్నిక్‌ ఆమ్లాన్ని గ్రహించి ఫ్లూ నివారణ మందుగా ఉపయోగించే టామిఫ్లూను తయారుచేయవచ్చని చెబుతున్నారు.

ఇప్పటి వరకూ వంటల్లో మసాలా దినుసుగా వాడే అనాస పువ్వునుండి మాత్రమే ఈ షిక్నిక్‌ ఆమ్లం లభ్యమవుతోందని, క్యారట్‌నుండి దీన్ని సేకరించగలిగితే ఈ ఆమ్ల సేకరణ మరింత సులభతరమవుతుందని జాకబో చెబుతున్నారు. తాము కనుగొన్న ఈ విధానం ద్వారా షిక్నిక్‌ ఆమ్లంతోబాటు ఫినోలిక్‌ సమ్మేళనాలను కూడా పొందవచ్చని, ఈ ఫినోలిక్‌ సమ్మేళనాలతో క్యాన్సర్‌, హృద్రోగాలను నివారించే మందులను అభివృద్ధి చేయవచ్చని జాకబో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News