: సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాలను విజ్ఞప్తి చేశాం: ఆనం
గత ఆరవై ఐదు రోజుల పైగా జరుగుతున్న ఉద్యమాలు, నిరసనలతో సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో సమ్మె విరమించాలని ఉద్యోగ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విద్యుత్ సంక్షోభం నుంచి ప్రజలను రక్షించాలని, పండుగ సమయంలో సమ్మె విరమించాలని విద్యుత్ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను కోరినట్టు చెప్పారు. ఉపాధ్యాయ, ఆర్టీసీ, విద్యుత్ జేఏసీ ప్రతినిధులతో మంత్రుల ఉపసంఘం ఈ రోజు చర్చలు జరిపింది.
అయితే, డైరెక్టుగా సీఎంతోనే చర్చలు జరుపుతామని ఉద్యోగ సంఘాలు తెలిపాయని చర్చలు ముగిసిన అనంతరం ఆనం మీడియాకు తెలిపారు. ఉద్యమంలోకి కొన్ని అసాంఘిక శక్తులు వస్తున్నాయని ఉద్యోగులకు వివరించామని, ముఖ్యమంత్రి ఆలోచనలతోనే తాము నడుస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాగా, చర్చల సమయంలో ఉద్యోగ సంఘాలతో, మంత్రి కొండ్రు మురళికి వాగ్వివాదం జరిగిందని తెలుస్తోంది. సమ్మె తీరు సరిగా లేదని కొండ్రు మండిపడటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రజాప్రతినిధులే రోడ్డుపైకి వస్తే తమకీ పరిస్థితి వచ్చేది కాదని తెలిపినట్లు తెలుస్తోంది.