: పిల్లలవల్లే ప్రమాదాలు జరుగుతాయట
ప్రయాణించే సమయంలో సాధారణంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయని మనం అనుకుంటాం. అంతేకాదు... చాలా ప్రమాదాల్లో ఇవే కారణాలుగా కూడా ఉంటున్నాయి. అయితే సెల్ కన్నా పిల్లలవల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయని పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు సెల్ మాట్లాడకపోయినా, పిల్లలు చేసే అల్లరివల్లే డ్రైవింగ్‌లో ఏకాగ్రత దెబ్బతింటుందని, ఫలితంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తేలింది.
మోనష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో ప్రయాణ సమయంలో పిల్లల వల్లే డ్రైవింగ్ చేసేవారి ఏకాగ్రత దెబ్బతింటుందని, దీనివల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని తేలింది. 1 నుండి 8 ఏళ్ల వయసున్న కనీసం ఇద్దరు పిల్లలున్న కుటుంబాల వారి వాహనాల ప్రయాణాలను దాదాపు మూడు వారాలపాటు పరిశోధకులు పరిశీలించారు. ఈ పరిశీలనలో 16 నిమిషాల ప్రయాణంలో డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తి మూడు నిమిషాల 22 సెకన్ల సమయంపాటు రోడ్డుపైనుండి దృష్టిని పక్కకు తిప్పుకుంటున్నట్టు గుర్తించారు. కొన్ని సందర్బాల్లో డ్రైవర్లు వారి పిల్లల వల్ల డ్రైవింగ్‌లో ఏకాగ్రతకు భంగమని వారు పరిగణించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు.
గతంలో జరిగిన అధ్యయనాల్లో ఒంటరిగా డ్రైవింగ్ చేసేవారికంటే వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో నంబర్లు డయల్ చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు 2.8 రెట్లు ఉండగా, ఫోన్ మాట్లాడడం, వినడం వల్ల 1.3 రెట్లు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. ప్రయాణ సమయంలో వెనుకనున్న పిల్లల్ని ముందున్న అద్దంలో గమనించడం ద్వారా 76.4 శాతం, వారితో మాట్లాడడం వల్ల 16 శాతం, లేదా వారికి ఏదైనా సాయం చేయడం వల్ల ఏడు శాతం, వారితో ఆడుకోవడం వంటి చర్యల వల్ల వారి ఒకశాతం డ్రైవర్ల ఏకాగ్రతకు భంగం కలుగుతోందని ఈ అధ్యయనంలో పాల్గొన్న జుడిత్ చార్ల్‌టన్ చెబుతున్నారు.