: దీనివల్లే ఐన్‌స్టీన్ ప్రత్యేకంగా నిలిచారు
భౌతిక శాస్త్రంలో ఐన్‌స్టీన్ రూపొందించిన సిద్ధాంతాన్ని తిరగరాసేవారు ఇప్పటివరకూ లేరు. ఆయన రూపొందించిన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని పలు సిద్ధాంతాలు రూపొందాయి. అంతటి మేధావిగా ఐన్‌స్టీన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అయితే ఐన్‌స్టీన్ ఇంతటి తెలివితేటలకు ప్రధాన కారణం ఆయన మెదడులోని ప్రత్యేకతేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐన్‌స్టీన్ మెదడును విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్ మెదడు అమరికలోని ప్రత్యేకత కారణంగా ఆయనకు అంతటి తెలివితేటలు వచ్చివుంటాయని చెబుతున్నారు.
ఐన్‌స్టీన్ మెదడును శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో విశ్లేషించారు. ఈస్ట్ చైనా నార్మల్ యూనివర్సిటీకిచెందిన వీవీ మెన్ తన ప్రయోగాలతో ఐన్‌స్టీన్ మెదడును విశ్లేషించారు. ఐన్‌స్టీన్ మెదడులోని కుడి, ఎడమ మస్తిష్కార్థగోళాలు ఒకదానితో ఒకటి విస్తృతంగా అనుసంధానమై ఉన్నాయని, ఈ కారణం వల్లనే ఆయనకు అంతటి తెలివితేటలు వచ్చివుంటాయని చెబుతున్నారు. ఐన్‌స్టీన్ మెదడులోని మస్తిష్క అర్ధగోళాలను అనుసంధానించే కార్పస్ కెలోజమ్ ఫైబర్లపై ఈ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను బ్రెయిన్ జర్నల్‌లో ప్రచురించారు. ఐన్‌స్టీన్‌కు సంబంధించి అద్బుత కాలంగా పేర్కొనే అతని 26 ఏళ్ల వయసులో ఆయన నాలుగు ప్రముఖమైన వ్యాసాలను రాశాడు. ఈ వ్యాసాలు అప్పటి అంతరిక్షం, ద్రవ్యరాశి, శక్తి విషయాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దృక్పథాలనే మార్చేశాయనే విషయం అందరికీ తెలిసిందే.