: ఇలాకూడా బరువు తగ్గవచ్చట
మీరు అధిక బరువున్నారా... అయితే మీలాంటి వారికొరకు శాస్త్రవేత్తలు ఇస్తున్న సలహా ఏమంటే కండరాలకు విశ్రాంతినిచ్చే బొటాక్స్ అనే పదార్ధం ఉపయోగించడం. ప్రస్తుతం సౌందర్య చికిత్సల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్న బోట్యులినమ్ టాక్సిన్ వ్యవహారిక నామమే బొటాక్స్. ఈ పదార్ధాన్ని ఉపయోగించడం వల్ల బరువు తగ్గడంతోబాటు వదులైన కండరాలను బిగుతుగా మార్చడానికి చక్కగా పనికొస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా అధిక బరువు కారణంగా చాలామందికి కండరాలు సాగిపోయి ఉంటాయి. ఇలాంటి వారు బరువు తగ్గడానికి పలు రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటివారిపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో బొటాక్స్ అనే పదార్ధాన్ని వాడడం వల్ల బరువు తగ్గుతారని తేలింది.
నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు బొటాక్స్ పదార్ధాన్ని ఎలుకలపై వాడి ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో ఈ పదార్ధాన్ని వాడడం వల్ల బరువు తగ్గడం జరుగుతుందని తేలింది. ఈ విషయం గురించి నార్వేజియన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హెలెన్ జొహాన్నిసెన్ మాట్లాడుతూ ఈ పదార్ధాన్ని మనుషులపై ప్రయోగించడానికి తమకు ఇంకా అనుమతి రావాల్సి ఉందని, గ్రాస్ట్రిక్ బైపాస్ సర్జరీకి, ఇతర ఖరీదైన శస్త్రచికిత్సలకు ఇది ప్రత్యామ్నాయం అవుతుందనే నమ్మకం తనకుందని చెబుతున్నారు.