: జగన్.. మీ స్వార్థం కోసం ఎంత మంది బలవ్వాలి?: సోమిరెడ్డి
'మీ స్వార్థం కోసం ఎంతో మంది జైలు పాలవుతుంటే, వారి తల్లిదండ్రుల ఆందోళన మీకు పట్టదా?' అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. "మీ బిడ్డ కోసం మా బిడ్డలు బలవ్వాలా?" అంటూ జగన్ నిన్న సోనియాను సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమిరెడ్డి ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై మండిపడ్డారు.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న 65 రోజుల తర్వాత జగన్ మాట్లాడడంపై సోమిరెడ్డి సందేహాలు వ్యక్తం చేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. జగన్ తో మాట్లాడాలని మొయిలీ చెప్పారని, వైఎస్ మొదలుపెట్టిన విభజనను సోనియా పూర్తి చేశారని దిగ్విజయ్ అన్నారని గుర్తు చేశారు.