: రాజకీయ పార్టీలు ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నాయి: అశోక్ బాబు


రాజకీయ పార్టీలు సమైక్య ఉద్యమం ముసుగులో ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నాయని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆందోళనల్లో భాగంగా ఉద్యోగ సంఘ నాయకులు దాడులకు పాల్పడవద్దని సూచించారు. రహదారుల దిగ్బంధం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత మాత్రమే చేపట్టాలని ఉద్యోగులను కోరారు. రాజకీయ నాయకుల అసలు రంగు ఈ రోజు బయటపడిందని ఆయన పేర్కొన్నారు. తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మాత్రమే ఆందోళన చేస్తున్నామని, పదవుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.

కొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు తమను పావులుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను ఒప్పించి తీర్మానాన్ని ఓడించినప్పుడే పార్టీల చిత్తశుద్ది తెలుస్తుందని అశోక్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాలు కట్టిపెట్టాలని రాజీనామాలను నేరుగా ప్రధానమంత్రికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News