: ధోనీ విజయ రహస్యం తెలుసంటున్న గ్రెగ్ ఛాపెల్
అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఎదిగిన ధోనీ విజయరహస్యం తనకు తెలుసని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ తెలిపాడు. జార్ఖండ్ డైనమైట్ విజయ రహస్యం 'గల్లీ క్రికెట్' అని తేల్చి చెప్పాడు. క్రికెట్ అకాడెమీలలో కాకుండా గల్లీ క్రికెట్ ద్వారానే ధోనీ రాటుదేలాడని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా గల్లీ క్రికెట్ గురించి గ్రెగ్ చిన్న లెక్చర్ ఇచ్చాడు. గల్లీ క్రికెట్ లో ఆటను పర్యవేక్షించడానికి తల్లిదండ్రులు, కోచ్ లు, పేరుమోసిన ఆటగాళ్లు ఉండరని చెప్పాడు. దీంతో... పిల్లలకు స్వేచ్ఛగా ఆడే వీలుంటుందని తెలిపాడు. అకాడెమీల్లో అయితే ఒకే ఏజ్ గ్రూప్ కలిగిన పిల్లలు సాధన చేస్తుంటారని... గల్లీ క్రికెట్ లో అయితే, పెద్ద వయసున్న వారినుంచి పిల్లల వరకు అందరూ కలసి ఆడుతుంటారని... దీంతో చిన్న వయసు నుంచే పోటీతత్వం అలవడుతుందని ఛాపెల్ అన్నాడు. ఈ గల్లీ క్రెకెట్ ఆడటం వల్లే ధోనీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను తమకు అనుగుణంగా మార్చుకునే పరిణతిని సాధించాడని తెలిపాడు.