: ఢిల్లీలో జర్మనీ యువతి అనుమానాస్పద మృతి
ఢిల్లీ నగర శివార్లలోని ఫరీదాబాద్ ప్రాంతంలో 19 ఏళ్ల జర్మనీ అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఫరీదాబాద్ లోని రైల్వే ట్రాక్ పక్కన ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. వివరాల్లోకి వెళితే... జర్మనీకి చెందిన ఈ అమ్మాయి పేరు జుడిత్ ఐనో ఎన్హాస్. ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేయడానికి వచ్చింది. ఈ సంస్థ యువత హక్కుల కోసం పోరాడుతుంది. ఈమె దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ ఏరియాలో మరో ఇద్దరు తోటి ఉద్యోగులతో కలసి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటోంది.
అయితే, మూడ్రోజుల క్రితం (బుధవారం) ఇంటికొచ్చిన ఇద్దరు కొలీగ్స్ కు జుడిత్ కనిపించలేదు. ఎంతసేపు ఎదురుచూసినా ఆమె రాకపోయేసరికి... ఫోన్ చేశారు. అయితే, ఆమె ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఫోన్ ఏ ప్రాంతంలో ఉందో ట్రేస్ చేయగా... అది ఫరీదాబాద్ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. అదే సమయానికి ఫరీదాబాద్ లోని రైల్వే ట్రాక్ పక్కన ఓ విదేశీ అమ్మాయి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడున్న మృతదేహం రెండ్రోజులుగా కనిపించకుండాపోయిన జుడిత్ దే నని నిర్ధారించారు.
ఆమె మరణం వెనుక ఉన్న కారణాలను కనుక్కోవడానికి... జుడిత్ తో పాటు ఇంట్లో ఉన్న సహోద్యోగులను, ఆఫీసులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జుడిత్ మరణవార్తను జర్మనీలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. వారు ఇక్కడకు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.