: టీ కబుర్లు...
కొందరికి టీ అంటే మహా ప్రియం. ఉదయాన్నే కాస్త చాయ్‌తాగితేగానీ ఒళ్లు పనిచేయడానికి సిద్ధం కాదు. ఇలాంటి అలవాటు చాలామందికే ఉంది. అందుకే ఒక సినిమాలో చాయ్ గురించి హీరో ఒక పాటనే పాడేశారుకూడా. అంతటి మహత్తు చాయ్‌కు ఉంది. కాబట్టే కాఫీకన్నా చాయ్ తాగితేనే మంచిదంటున్నారు నిపుణులు, చాయ్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలిఫినాల్స్ మన శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయట. అలాగే దీర్ఘకాలం పాటు గ్రీన్‌టీ, బ్లాక్ టీ తాగే అలవాటున్న వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువే. ఇక గ్రీన్ టీని ఎక్కువగా తాగేవారికి రొమ్ము క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. కాఫీతో పోలిస్తే టీలో కెఫీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి ఉత్సాహం లభిస్తుంది. తక్కువ కెఫీన్ ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు.
అలాగే ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోను స్థాయిని నియంత్రించడంలో బ్లాక్‌టీ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే పుదీనా, తులసి వంటి హెర్బల్ టీలను తాగేవారిలో కాలేయం పనితీరు చక్కగా మెరుగుపడుతుంది. రోగనిరోధకశక్తి కూడా మెరుగుపడుతుందట. చాయ్‌లో ఎన్ని సుగుణాలున్నాయో తెలిసిందిగా... ఇక చక్కగా చాయ్ తాగుతూ మన ఆరోగ్యాన్ని పెంచుకుందాం. అయితే ఇక్కడో హెచ్చరికేమంటే మంచిదే కదా అని అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టేనట. కాబట్టి మితంగా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.