: విభజనకు ప్రజలు సహకరించాలి.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి: బొత్స
కేంద్ర కేబినెట్ నిర్ణయం తమకూ బాధ కలిగించిందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. అయినా సరే, 'విభజనకు ప్రజలు సహకరించాలి.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆయన ఈ రోజు మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయం రాయలసీమ, ఆంధ్ర ప్రజల్ని ఆందోళనకు గురి చేసిందని, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా తాము కూడా ఆందోళన చెందామని అన్నారు. జూలై 30న అనివార్య పరిస్థితుల్లో ప్రజాస్వామ్యపద్దతిలో రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ విభజనకు అంగీకారం తెలిపాయని గుర్తుచేశారు. అయితే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పరిష్కారం ఇచ్చింది కనుక, కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకభావం ఏర్పడటం సహజమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ పార్టీకి చెందిన వ్యక్తులుగా తమ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమని అన్నారు. రాజకీయ లబ్ది కోసం, స్వార్థం కోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ, రాష్ట్రంలోనూ తప్పుడు మార్గాలు తొక్కలేదని ఆయన అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఆందోళనలు, నిరసనలు, ఆగ్రహజ్వాలలతో అట్టుడుకుతున్నాయని తెలిపారు. విభజన ప్రకటన తరువాత చంద్రబాబు, జగన్ లు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని అడిగారా? అని వారిని ప్రశ్నించారు.
గతంలో ఆ రెండు పార్టీలు కూడా, 'అధికారంలో ఉన్న వారే నిర్ణయం తీసుకోవాలన్నా'రే తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అడిగారా? అని నిలదీశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు జరిగే అన్యాయాలపై తమకు అవగాహన ఉందని అన్నారు. ప్రజలు భవిష్యత్తుపై ఆలోచించాలని ఆయన సూచించారు. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. రానున్న మూడు నెలల్లో ప్రజలు తమ సమస్యలపై మాట్లాడాలని ఆయన సూచించారు.