: ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపివేత.. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తాం:అశోక్ బాబు
కేంద్రం నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులు నిలిపేస్తామని ఉద్యోగులు ముందుకు వచ్చారని, దీంతో విభజనకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ సర్వీసులను కూడా నిలిపివేయడానికి నిర్ణయించామని అన్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయని ఆయన స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అశోక్ బాబు వెల్లడించారు.
కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశారని టీవీలు చెప్పడమే కానీ ఒక్క మంత్రి కూడా రాజీనామా చేసినట్టు తెలియదని ఆయన అన్నారు. రాజీనామాల్ని కేంద్రం ఆమోదించలేదని మంత్రులు అంటే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. వారు తక్షణం రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన బిల్లు ముసాయిదాకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని పబ్లిక్ డిక్లరేషన్ తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు.
ఇవ్వని వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 60 రోజులుగా చిరుద్యోగులు జీతాలు త్యాగం చేసి ఉద్యమంలోకి వస్తూంటే ప్రజాప్రతినిధులు రాజీనామాలకు వెనుకడుగు వేయడం చూస్తే సిగ్గేస్తోందని ఆయన విమర్శించారు. తాము జీతాలు, బోనస్ లు అడగడం లేదని, జాతికి న్యాయం చేయండని అడుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
విభజన వల్ల రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోతారని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్రం ముక్కలవ్వడం సరికాదని ఆయన సూచించారు. 2014 ఎన్నికల్లో సమైక్యవాదానికి తూట్లు పోడిచిన వారికి రాజకీయ సమాధి తప్పదని ఆయన అన్నారు. ఎంపీలు రాజీనామాలు చేయకుండా 'లోపల ఉండి ప్రయత్నిస్తాం' అని చెప్పడం మానాలని, వారి మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాలు అంతిమపోరాటం చేస్తున్నాయని ఆయన అన్నారు. కేబినెట్ నిర్ణయం అంతిమం కాదని ఆయన తెలిపారు. బిల్లును ఓడించేందుకు, ప్రజలు నిరాశ చెందకుండా ఉద్యమించాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు తమ ఉద్యమంలోకి వస్తామంటున్నారనీ, అయినప్పటికీ తాము ఒంటరిగానే ఉద్యమాన్ని నడిపిస్తామని ఆయన అన్నారు.