: కుటుంబం పరువు తీశారు.. ఆనం బ్రదర్స్ పై తమ్ముడు ఫైర్
ముఖ్యమంత్రి పదవి కోసం గత మూడు రోజులుగా సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ అంటూ కుటుంబానికే మచ్చ తెచ్చావంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై ఆయన సోదరుడు, మాజీ కార్పోరేటర్ ఆనం జయకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా పెద్దలు సంపాదించిన పేరు ప్రతిష్ఠలను దిగజార్చి మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేగా ఆనం వివేకానందరెడ్డిలు సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలపడం వారిని గెలిపించిన ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి పదవీ కాంక్షతోనే వీరు విభజనకు మద్దతు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికితే మరణించిన తమ తండ్రి ఆత్మ క్షోభిస్తుందని ఆయన గుర్తు చేశారు. తమను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని ఆనం సోదరులకు జయకుమార్ రెడ్డి సూచించారు.