: కేంద్ర మంత్రుల రాజీ'డ్రామా'లు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మళ్లీ రాజీనామా డ్రామాలు మొదలు పెట్టారు. గురువారం మొదలు పెట్టిన ఈ తతంగాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. నేతలు రాజీనామాలు చేస్తే తమ రాజీనామా ప్రతులను ప్రదర్శించి మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తారు. కానీ ఇంతవరకు ఆయా నేతలు అటువంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. పురంధేశ్వరి, కిల్లి కృపారాణి, చిరంజీవి ఎవరికీ అందుబాటులో లేకుండా ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. అసలు వీరు రాజీనామాలు చేశారా? లేక కొత్త డ్రామాలకు తెరతీశారా? అని ప్రజలు నిలదీస్తున్నారు.
వీరిలో చాలామందికి సుదీర్ఘ నిరీక్షణ తరువాత మంత్రి పదవులు లభించాయి. అదీకాక వీరి పదవీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. మరోసారి తమ పార్టీ విజయం సాధించే అవకాశం ఎలాగూ లేదు. దీంతో చివరి ఏడాది కూడా పదవులు అనుభవించాలనేది వీరి భావనలా కనిపిస్తోంది. సీమాంధ్ర ప్రజల ఆందోళన తీవ్రతను తగ్గించేందుకే వీరు రాజీనామా ప్రకటన చేశారని, కానీ ఆచరణకు దూరంగా ఉన్నారని విమర్శకులు అంటున్నారు. కాగా వారి రాజీనామాల్లో నిజాయతీ లేదని స్వంత పార్టీ నేతలే అంటున్నారు.