: కొలెస్టరాల్‌ను ఇలా కరిగించుకోవచ్చట!
మీ శరీరంలో అధిక కొలెస్టరాల్ ఉందా... దాన్ని కరిగించుకోవాలని మీరు కోరుకుంటున్నారా... అయితే మీలాంటి వారికోసమే ఈ వార్త. శరీరంలో ఉండే కొలెస్టరాల్‌ను సగందాకా తగ్గించివేసే ఒక సరికొత్త టీకాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. శరీరంలో పేరుకుపోయే కొలెస్టరాల్ ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి కొలెస్టరాల్‌ను కరిగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాము. అలా కాకుండా కొందరు కొలెస్టరాల్ కరిగించుకోవడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించలేరు. ఇలాంటి వారికోసమే శాస్త్రవేత్తలు ఈ కొత్త టీకాను అభివృద్ధి చేశారు.
ప్రాణాంతక కొలెస్టరాల్‌ను 57 శాతం దాకా తగ్గించే టీకాను శాస్త్రవేత్తలు కొందరు రోగులపై విజయవంతంగా ప్రయోగించారు. ఈ టీకా హానికారక కొలెస్టరాల్‌గా వ్యవహరించే లోడెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్‌డీఎల్)ను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుందని, ఈ పద్ధతితో అధిక కొలెస్టరాల్‌తో బాధపడే రోగులకు కొత్త తరహా చికిత్సను అందించడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఎల్‌ఎన్-పీసీఎస్‌గా పిలిచే ఈ కొత్తరకం టీకా కొలెస్టరాల్‌ను నియంత్రించే పీసీఎస్‌కే9 అనే ప్రొటీన్ ఉత్పత్తిని అడ్డుకుంటుందని, రక్తంలోని హానికారక కొలెస్టరాల్‌ను తొలగించే రిసెప్టర్లను ఈ ప్రొటీన్ దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త ఔషధంతో చేసే చికిత్సలు అధిక కొలెస్టరాల్‌తో బాధపడే రోగులకు ఆశలు కల్పిస్తున్నాయని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వైద్య సంచాలకులు ప్రొఫెసర్ పీటర్ వీస్‌బెర్గ్ పేర్కొన్నారు.