: అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించండి..48 గంటలు సీమాంధ్ర బంద్: అశోక్ బాబు
ఈ రోజు జరిగిందేదో జరిగింది, కానీ అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ 60 రోజులుగా ఉద్యోగులు జీతాలను వదులుకుని, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నా తీవ్ర ఉద్యమం చేస్తుంటే కేంద్రం తేలిగ్గా తీసుకోవడం దారుణమని అన్నారు. 'రాజీనామాలు కోరితే రాజీనామాలు చేయకుండా తెలంగాణ నోట్ ను అడ్డుకుంటామన్నారు, అలాంటిది నోట్ కేబినెట్ ఆమోదం పొందింది. మీరేం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంద'ని ఆయన అన్నారు.
భవిష్యత్ లో ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తాము చెప్పినట్టు రాజీనామాలకు కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలని ఆయన కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. 13 జిల్లాల్లో జాతీయ రహదారులు దిగ్బంధనం చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. 6 వ తేది ఉదయం ఏపీఎన్జీవోలు, జేఏసీ సమావేశం నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.
కేబినెట్ చరిత్రలో జైఆంధ్ర ఉద్యమాన్ని మరోసారి గుర్తు చేసేలా మరో ఉద్యమం చేస్తామని అశోక్ బాబు తెలిపారు. ఇల్లు అలకగానే పండగ కాదన్న ఆయన, విద్యుత్ శాఖ ఉద్యోగులతో మాట్లాడి బంద్ లోకి తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో సివిల్ వార్ రాబోతోందని ఆయన హెచ్చరించారు. సీమాంధ్రలోని అన్ని వ్యవస్థలు సమ్మెలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలు ఆస్తి నష్టం కల్పించవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేయనున్నారనేది తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. 'సమ్మె కొనసాగుతుంది. రేపు ఎల్లుండి 48 గంటపాటు జాతీయ రహదారుల దిగ్బంధనంతో పాటు, బంద్ జరుగుతుంద'ని ఆయన స్పష్టం చేశారు. రానున్న 48 గంటల పాటు ఒక్క వాహనం కూడా కదలకుండా చూడాలని ఆయన ప్రజలకు సూచించారు.
కేంద్ర నిర్ణయం దుర్మార్గమని తెలిపిన ఆయన, 'ఒక వ్యక్తి చెప్పాడని ఆర్డినెన్స్ నే బుట్టధాఖలు చేశారు. కోట్ల మంది ప్రజలు కోరుతున్న డిమాండ్ కోసం నిర్ణయం వెనక్కి తీసుకోరా?' అని ఆయన సూటిగా ప్రశ్నించారు.