: బాబ్లీపై భగ్గుమన్న ఎర్రబెల్లి
టీడీపీ హయాంలో బాబ్లీ నిర్మాణానికి పునాది పడిందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధమని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాని జోక్యం చేసుకుని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యను తెలుసుకోవాలని ఎర్రబెల్లి సూచించారు.
ఉత్తర తెలంగాణను ఎడారిగా మార్చే బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి సూచించారు. బాబ్లీపై సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల 4వ తేదీన ఎస్సారెస్పీ పరిధిలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, 7వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ నెల 8వ తేదీన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ, 9న వరంగల్, నల్గొండ కలెక్టరేట్ ల దగ్గర ధర్నాలు చేపట్టనున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు.