: తెలంగాణపై టేబుల్ నోట్ ప్రవేశపెట్టనున్న షిండే!
సీమాంధ్ర అట్టుడుకుతున్నా... కేంద్రం మాత్రం తెలంగాణకు అనుగుణంగా తన పని తాను చేసుకుపోతూనే ఉంది. హోం మంత్రి షిండే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి టేబుల్ నోట్ ను తయారుచేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ రోజు సాయంత్రం జరిగే కేబినేట్ మీటింగ్ లో ఆయన ఈ టేబుల్ నోట్ ను ప్రవేశపెట్టనున్నారు. 22 పేజీలతో కూడిన ఈ తెలంగాణ ముసాయిదాపై చర్చించబోతున్నారు. ఈ రోజు జరుగుతున్న కేబినేట్ మీటింగ్ లో తెలంగాణ అజెండా లేకపోయినా... షిండే టేబుల్ నోట్ ను ప్రవేశపెడుతుండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. జరుగుతున్న పరిణామాలతో, సీమాంధ్ర నాయకుల్లో అలజడి మొదలైంది.
ఈ టేబుల్ నోట్ లో... గతంలో సీడబ్ల్యూసీ పేర్కొన్న అన్ని అంశాలు యధాతధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర విభజనపై ఒక బిల్లు, ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు అనుగుణంగా నోట్ తయారైనట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు నదీజలాలు, ఇతర సమస్యలను పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేయాలని టేబుల్ నోట్ లో సూచించినట్టు తెలుస్తోంది. ఈ టేబుల్ నోట్ పై చర్చ జరిగాక దీన్ని అసెంబ్లీ తీర్మానానికి పంపే అవకాశం ఉంది.