: కడుపారా టిపినీలు తింటే ఇలా మేలేనట!
మీరు సంతాన లేమితో బాధపడుతున్నారా... అయితే చక్కగా ఉదయం పూట కడుపారా టిఫిన్ చేయడంవలన ఆ సమస్య తగ్గే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే మహిళల్లో కొందరికి నెలసరి సక్రమంగా లేని కారణంగా సంతానలేమి సమస్యలు ఎదురవుతాయట. ఇలాంటి వారు చక్కగా ఉదయం పూట కడుపునిండా టిఫిన్ లాగిస్తే అలాంటి సమస్యలు దూరమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
నెలసరి సక్రమంగా లేని మహిళలు ఉదయం పూట ఎక్కువ కేలరీలతో కూడిన టిఫిన్ చేయడం వల్ల సంతానలేమి సమస్యలనుండి బయటపడే అవకాశం ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. చక్కటి టిఫిన్ చేయడం వల్ల అండాశయంలో నీటితిత్తుల మూలంగా నెలసరి అస్తవ్యస్తం అయ్యే మహిళల ఆరోగ్యంపై చక్కటి ప్రభావం చూపుతుందని జెరూసలేంలోని హీబ్రూ విశ్వవిద్యాలయం, టెల్‌అవిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. వీరు ఈ విషయంపై నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో కడుపారా అల్పాహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు దూరం అవుతాయని తేలింది. అండాశయంలో నీటి తిత్తులు ఇన్సులిన్ నిరోధకతకు, పురుష హార్మోన్ అయిన టెస్టోస్టీరాన్ స్థాయిలు పెరగడానికి దారితీస్తాయని, ఫలితంగా నెలసరి అస్తవ్యస్తం కావడం, తలపై జుట్టు ఊడిపోవడం, ఇతర భాగాల్లో వెంట్రుకలు పెరగడం, మొటిమలు, సంతాన సమస్యలు వంటి పలు రకాలైన సమస్యలు వస్తాయని తేలింది. అలాకాకుండా ఉదయం పూట చక్కటి టిఫిన్ చేసిన వారిలో గ్లూకోజు స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత 8 శాతం వరకూ పడిపోయినట్లు తేలింది. టెస్టోస్టీరాన్ మోతాదు కూడా యాభై శాతం తగ్గినట్టు వెల్లడైంది. పైగా అండం ఫలదీకరణ వేగవంతం కావడం కూడా ఇక్కడ విశేషమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.