: ఓరిమితో ఎప్పటికైనా మేలేనట!
చాలామందిలో ఓర్పు తక్కువగా ఉంటుంది. కొందరు ఎక్కువ సేపు వేచి చూడడం వంటివి చేయలేరు. కానీ ఇలా ఓపికగా నిరీక్షించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఓరిమిగా ఆలోచించడం వల్ల తర్వాత కాలంలో పలు రకాలైన ప్రయోజనాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓపిక ఉండేవారు ఆర్ధిక సంబంధమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
కీలకమైన విషయాల్లో మంచి నిర్ణయం తీసుకోవడానికి కాస్త ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. ఇలాంటి ఓపిక అనేది సదరు విషయాల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపకరిస్తుందని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యెలెట్ ఫిష్‌బ్యాచ్ మాట్లాడుతూ ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునే విషయంలో కొంత సమయం వేచి చూడడం అనేది అద్భుతమైన ఫలితాలను ఇచ్చినట్టు తెలిపారు. ఈ దిశగా తాము చైనా, హాంకాంగ్ లలో విస్తృతమైన పరిశోధనలు నిర్వహించామని యెలెట్ తెలిపారు.
ఇందుకోసం శాస్త్రవేత్తలు కొందరిని ఎంపిక చేసుకుని వారిని మూడు బృందాలుగా విభజించారు. వారిముందు మూడు రకాల ప్రతిపాదనలు ఉంచారు. ఇన్ని రోజుల పాటు వేచి చూస్తే ఇంత మొత్తం నగదు వస్తుందని మూడు విధాలైన ప్రతిపాదనలను వారికి వివరించారు. తర్వాత వారిని 27 రోజుల తర్వాత ఫోన్ ద్వారా పలకరించి ఏం నిర్ణయించుకున్నారో చెప్పాల్సిందిగా కోరారు. అందరూ అధిక మొత్తం వచ్చే అవకాశం ఉన్నవైపే మొగ్గుచూపారట. అంతేకాదు దీనికోసం ఓపికగా ఎదురుచూడడానికి కూడా అందరూ సుముఖతను వ్యక్తం చేసినట్టు పరిశోధకులు తెలిపారు. కాబట్టి ఓపికగా నిరీక్షిస్తే మేలే జరుగుతుందట!