: ఈ ఎక్స్ కిరణాలు చాలా షార్ప్
ఎక్స్ కిరణాలు సాధారణంగా చాలా పదునుగా ఉంటాయి. అయితే అంతకన్నా కూడా పదునైన ఎక్స్ కిరణాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ కిరణం అత్యంత సన్నగా ఉండడంతోబాటు భవిష్యత్తులో ఇది చాలా రకాలుగా ఉపకరించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే 9 అత్యంత పదునైన ఎక్స్‌రే పుంజాన్ని అభివృద్ధి చేశారు. ఈ పుంజం వెంట్రుకకన్నా పదివేల రెట్లు సన్నదిగా ఉంది. దీని వ్యాసం ఐదు నానో మీటర్లకన్నా కూడా తక్కువేనని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన టిమ్ సాల్టిడ్ చెబుతున్నారు. ఈ పుంజం వల్ల సూక్ష్మమైన వివరాలపైకూడా దృష్టి సారించవచ్చని, ఇందుకు సాధారణ లెన్స్‌కు బదులుగా అనేక పొరలు కలిగిన ఫ్రెస్నెల్ లెన్స్‌ను ఉపయోగించినట్టు టిమ్ తెలిపారు. ఇలాంటి లెన్స్‌ను అమర్చిన యంత్రం ద్వారా 4.3 నానో మీటర్లు (మిల్లీ మీటర్‌లో పదిలక్షల వంతు) వ్యాసం కలిగిన ఎక్స్‌రే పుంజాన్ని సృష్టించామని, దీని ద్వారా పదార్ధ శాస్త్రంలో పలు కొత్త ప్రయోగాలకు అవకాశాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఎక్స్‌రే పుంజం సౌర బ్యాటరీల్లో ఉపయోగించాల్సిన నానో వైర్ల తనిఖీకి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.