: త్వరలో ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుంది: బొత్స
ఆంటోనీ కమిటీ త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనిపై దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారని బొత్స తెలిపారు. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన బొత్స ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనల వల్ల ఆర్టీసీ నష్టపోతోందని, దానివల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానన్నారు.
అయితే, 2009లో తెలంగాణపై తీసుకున్న నిర్ణయాలపై కొందరు వెనక్కి వెళ్లారన్న బొత్స.. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు మూడుసార్లు లేఖ ఇచ్చారన్నారు. కాగా, సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదన్నారు. తామంతా కాంగ్రెస్ వాదులమని, పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ సమష్టి బాధ్యత వహిస్తామని చెప్పారు. రాజీనామాల విషయంలో మంత్రుల మధ్య అభిప్రాయభేదాలున్నాయని పేర్కొన్నారు.