: బీజేపీకి రెండు ప్రాంతాలూ ముఖ్యమే: సీమాంధ్ర నేతలతో అద్వానీ
విభజన నేపథ్యంలో పునరాలోచనలో పడ్డ సీమాంధ్ర బీజేపీ నేతలు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీమాంధ్రలో పార్టీని రక్షించుకునేందుకు, ఇక్కడి ప్రజలకు న్యాయం చేసేందుకు వారు ఈ ఉదయం ఢిల్లీ పెద్దలను కలిశారు. ఈ సందర్భంగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ పరిస్థితి గురించి, విభజన వల్ల జరిగే నష్టాలపై అగ్రనేత అద్వానీకి ఓ నోట్ ఇచ్చారు. తాము చెప్పిందంతా విన్న అద్వానీ.. రెండు ప్రాంతాలూ ముఖ్యమేనని చెప్పారని సీమాంధ్ర నేతలు తెలిపారు. సీమాంధ్రులకు న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారని వారు చెప్పారు.
అలాగే కేసీఆర్, కేటీఆర్, ఈటెల వంటి టీఆర్ఎస్ నేతలు ప్రతిరోజూ సీమాంధ్రులను దూషిస్తున్నారని, అదే సమయంలో బీజేపీ తెలంగాణ నేతలు పక్కనే ఉండి మౌనం వహిస్తుండటం ఎంతవరకు సమంజసమన్న దానిపైనా ప్రశ్నించామని వివరించారు. దీనిపైన స్పష్టమైన విధానం అవలంభించాలని చెబుతామని పార్టీ అగ్రనేతలు చెప్పారన్నారు. ఇటీవల పాలమూరు సభలో సుష్మాస్వరాజ్ ఏకపక్షంగా మాట్లాడటం తమ మనసును గాయపరిచిందని చెప్పామని సీమాంధ్ర బీజేపీ నేతలు వెల్లడించారు.