: వెస్ట్ గేట్ ఘటనపై విచారణకు ఆదేశం
కెన్యా ప్రతిష్ఠను మసకబార్చిన వెస్ట్ గేట్ షాపింగ్ మాల్ ఘటనపై విచారణకు ఆ దేశాధ్యక్షుడు ఉహుర్ కెన్యెట్టా ఆదేశించారు. ఈ మేరకు ఓ కమిషన్ ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల క్రితం నైరోబీలో జరిగిన దారుణ మారణహోమంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని నేడు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో దేశాధ్యక్షుడు సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉహుర్ కెన్యెట్టా మాట్లాడుతూ.. ఘటనకు కారణాలు అన్వేషించడమే కాకుండా, భద్రతాపరమైన వైఫల్యాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా విచారణ కమిషన్ సూచిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా 67 మంది అసువులు బాశారు.