: నల్గొండ జిల్లాలో రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన కారును ఢీకొన్న గూడ్స్ రైలు
నల్గొండ జిల్లా భువనగిరి లోని అనంతారం బ్రిడ్జి వద్ద ఈ తెల్లవారుజామున రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన ఇన్నోవా కారును ఖాజీపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై వెళుతున్న ఇన్నోవా కారు బ్రిడ్జి వద్ద రివర్స్ చేస్తుండగా కారు ట్రాక్ పై నిలిచిపోయింది. కారును బయటకు తీసేందుకు డ్రైవర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతలో అటుగా వస్తున్న గూడ్స్ రైలు డ్రైవర్ దీన్ని గమనించి వేగాన్ని తగ్గించాడు. దీంతో రైలు కారును ఢీకొట్టి సుమారు పదిమీటర్లవరకు లాక్కెళింది. కాగా ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కారు కొంతమేరకు ధ్వంస మయింది. గూడ్స్ రైలు డ్రైవర్ వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటీన అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది కారును ట్రాక్ పై నుంచి పక్కకు తొలగించారు. దీంతో రైళ్ళ రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. రైల్వే పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.