: కంటి జబ్బును ముందే కనిపెట్టవచ్చు


కంటి చూపును కోల్పోయే ప్రమాదమున్న జబ్బును ముందే గుర్తిస్తే... దానికి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చుకదా... అలాంటి ఒక కొత్తరకం కంటి పరీక్షను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా వయసుతోబాటు పెరిగే కంటిపాప క్షయం (ఏఎండీ) జబ్బును ముందుగానే గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

కంటిపాప క్షయం అనేది ప్రాథమిక దశలో గుర్తించడం కష్టం. ఎందుకంటే ప్రారంభదశలో చూపు బాగానే ఉంటుంది. కానీ క్రమంగా కంటిలోని మిగిలిన భాగాలను ఈ జబ్బు దెబ్బతీస్తుంది. తద్వారా అంధత్వానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన దృష్టి కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంటిపరీక్షలు ముందుగా ఈ జబ్బును గుర్తించలేవని, అయితే తాము అభివృద్ధి చేసిన సరికొత్త పరీక్షతో వైద్యులు ఈ ప్రమాదాన్ని ముందుగా గుర్తించి అంధత్వాన్ని నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుతున్నకొద్దీ చాలామందికి రెటీనాలో పసుపు మచ్చలు ఏర్పడతాయని, డ్రసెన్‌గా పిలిచే దీనివల్ల కంటిపాప క్షయం వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆస్ట్రేలియా జాతీయ విశ్వవిద్యాలయం 'ఐ సెంటర్' ప్రొఫెసర్‌ టెడ్‌ మేడెస్‌ చెబుతున్నారు. ఈ వ్యాధి ప్రాథమిక దశలో ఉన్నవారు ఎల్‌సీడీ తెరలపై దృశ్యాలను చూస్తున్నప్పుడు వారి కంటిపాపలు ఎలా స్పందిస్తున్నాయనేది వీరు రూపొందించిన నిజక్షేత్ర విశ్లేషణ పరికరంతో గుర్తించారు. ప్రస్తుతమున్న పరికరాలు కంటి ప్రధాన దృష్టి క్షేత్రాన్నే పరీక్షిస్తాయని, తాము రూపొందించిన ఈ సరికొత్త విధానంతో మొత్తం దృష్టి తీరును పరీక్షించవచ్చని మేడెస్‌ చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు అందరూ పూర్తిగా దృష్టిని కోల్పోతారని కచ్చితంగా చెప్పలేకపోయినా ఒకవేళ అలాంటి ప్రమాదముంటే ముందుగానే గుర్తించవచ్చని వీరి పరిశోధనల సారాంశం. ఈ విషయాలను గ్రేఫ్స్‌ ఆర్కైవ్‌ ఫర్‌ క్లినికల్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఆప్తాల్మజీ జర్నల్‌లో ప్రచురించారు.

  • Loading...

More Telugu News