: పిల్లలు లేనివారికి ఇదో వరం!
పిల్లలు పుట్టలేదని చింతించేవారికి శాస్త్రవేత్తలు వివిధ పద్ధతుల్లో సంతాన భాగ్యం కలిగిస్తున్నారు. ఈ విషయంలో సంతానం లేకపోవడానికి కారణాల్లో కొందరు మహిళల్లో అండాల ఉత్పత్తి తక్కువగా ఉండడమే! ఇలాంటి వారికి ప్రత్యేక విధానం ద్వారా అండాల ఉత్పత్తి పెరిగేలా చేసి తద్వారా వారిలో కూడా సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని కల్పించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఒక సరికొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిద్వారా మహిళల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అండాల ఉత్పత్తి లేమి కారణంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి వారి అండాశయంలో అండాలను ఉత్పత్తి చేయడానికి అమెరికా, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇన్‌విట్రో యాక్టివేషన్ (ఐవీఏ) అనే పద్ధతి ద్వారా మహిళ అండాశయాన్నిగానీ, లేదా అండాశయంలోని కొంత భాగాన్నిగానీ తొలగించి, అవసరమైన చికిత్స చేసి తిరిగి మహిళ ఫెలోఫియన్ ట్యూబులవద్ద అమరుస్తారు. తర్వాత కొన్ని హార్మోన్ల ద్వారా మహిళలకు చికిత్స చేసి అండాశయంలో అండాలు ఉత్పత్తి అయ్యేలా ప్రేరణ కలిగిస్తారు. ఈవిధంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.