: మంత్రి గంటాతో శైలజానాథ్, లగడపాటి భేటీ
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో సీమాంధ్ర మంత్రుల సమావేశం కొనసాగుతుండగానే మరో భేటీ జరిగింది. మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఈ భేటీలో మంత్రి శైలజానాథ్ తో పాటు ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. అనుకోకుండా కలిశామని చెబుతున్న ఈ నేతలు తమ సమావేశంలో రాజీనామాలపై చర్చ జరిగిందన్నారు. ఎంపీలుగా తాము రాజీనామాలు చేశామన్న లగడపాటి రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయొద్దని, శాసనసభలో విభజన తీర్మానాన్ని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు సమాచారం. అనంతరం మంత్రులు గంటా, శైలజానాథ్, ఏరాసులు కేంద్ర మంత్రి చిరంజీవితో కూడా సమావేశమయ్యారు.